Headlines

ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!


ఆకలి తీర్చుకోవడానికి అడుగులేస్తే… ఆఖరి శ్వాసగా మిగిలింది.. రైలు కింద నలిగిపోయిన ఆడపులి!

నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం (మే 23) అర్ధరాత్రి ఒక తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మహానంది సమీపంలోని రైలు పట్టాలపైకి వచ్చిన ఒక ఆడ పెద్దపులి, వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వన్యప్రాణుల రక్షణకు కేంద్రంగా ఉన్న నల్లమల అడవుల్లో ఈ ఘటన జరగడం పర్యావరణ ప్రేమికులను, అటవీ శాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గాజులపల్లి రైల్వే స్టేషన్ నుండి చలమ రైల్వే స్టేషన్ మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ను దాటడానికి ఒక పెద్దపులి ప్రయత్నించింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగ్గా, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి చలమ రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. వారు తక్షణమే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన పులిని పరిశీలించిన అధికారులు, అది సుమారు ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన ఆడ పెద్దపులిగా నిర్ధారించారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న పులి ఇలా రైలు ప్రమాదంలో మరణించడం పట్ల అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సెల్వం పర్యవేక్షణలో పెద్దపులికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ చట్టాల నిబంధనల ప్రకారం పెద్దపులి మృతదేహానికి అటవీ ప్రాంతంలోనే అధికారికంగా ఖననం నిర్వహించారు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని చలమ ఫారెస్ట్ రేంజ్ అధికారి నాగభూషణం తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *