నెల్లూరు, మే 27, 2026:
కోవూరు నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.
yకార్యక్రమానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ముందుగా నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మహానాడును స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ లైవ్‌లో వీక్షించారు
సాంకేతికతతో పొదుపు – నారా లోకేష్ ఆలోచన
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపును దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజిటల్ పద్ధతిలో మహానాడును నిర్వహిస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ గారి సృజనాత్మక ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో పండగ వాతావరణంలో మహానాడు జరుగుతోందని, అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 82 క్లస్టర్లలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.
జిల్లాకు రానున్న భారీ పరిశ్రమలు
జిల్లా అభివృద్ధిపై ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. “నెల్లూరు జిల్లాకు త్వరలోనే భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
