Headlines

ఇన్నాళ్లు ఓ లెక్క.. ఈ 5 రోజులు మరో లెక్క.. తెలుగు రాష్ట్రాలకు ‘రెడ్ అలర్ట్’ వార్నింగ్! | Be Alert: Telangana Turns into a Fiery Inferno Heat Waves High Alert in AP Until the 26th


తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలాడిపోతున్నాడు. నిన్నటిదాకా నిప్పుల వర్షం కురిపించిన సూర్యాభాయ్, ఇవాళ్టి నుంచి అంతకుమించి విజృంభించేందుకు సిద్ధమయ్యాడు. రానున్న ఐదు రోజుల పాటు తన విశ్వరూపం చూపించబోతున్నాడు. బయటకు రా చూసుకుందాం అంటూ సవాల్ విసురుతున్నాడు. ఇన్నాళ్లు ఓ లెక్క… ఈ ఐదురోజులు మరో లెక్క అన్నట్లుగా హీట్ తుఫాన్‌తో విరుచుకుపడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వాతావరణశాఖ అధికారులు సైతం పరిస్థితి దారుణంగా ఉండబోతోందని, భానుడి చర్యలు ఊహాతీతమని డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.

ప్రస్తుతం ఇంటి నుంచి అడుగు బయటపెడితే నిప్పుల వాన కురుస్తోంది. కిలోమీటరు ప్రయాణం చేస్తేనే కళ్లు బైర్లు కమ్మేంత వేడి పుడుతోంది. సరే, ఇంట్లోనైనా ప్రశాంతంగా ఉందామా అంటే భరించలేనంత ఉక్కపోత వేధిస్తోంది. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్నా శరీరం చెమటలు కక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎదుర్కొంటున్న కష్టాలివి. అయితే అధికారులు మాత్రం ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఐదురోజులపాటు మాడు పగిలిపోయే ఎండలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

తెలంగాణకు రెడ్, ఎల్లో అలర్ట్‌లు

తెలంగాణ రానున్న ఐదు రోజులు మండే అగ్నిగోళంగా మారబోతోందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట.

ఎల్లో అలర్ట్ జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, హన్మకొండ, జనగామ, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్ కర్నూలు, వరంగల్, మహబూబాబాద్, నారాయణపేట, వికారాబాద్, భువనగిరి, వనపర్తి.

ఆంధ్రప్రదేశ్‌లో హైఅలర్ట్

ఇటు ఏపీని సైతం వాయించేందుకు భానుడు రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఏపీలో ఈ నెల 26 వరకు హైఅలర్ట్ ప్రకటించారు. రానున్న వారం రోజులపాటు కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోత ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.

మొత్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు వడగాల్పుల తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాతే ఉష్ణోగ్రతలు కాస్త శాంతించే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బీ అలర్ట్… బీ కేర్‌ఫుల్!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *