అడవిని నమ్ముకుని జీవించే గిరిజనుల జీవనశైలి ప్రకృతితో మమేకమై ఉంటుంది. వారు తినే ప్రతి పండు, పంటను ముందుగా ప్రకృతికి, గ్రామ దేవతలకు సమర్పించిన తర్వాతే స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో మామిడి సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునేదే “మామిడికాయల పండుగ”.అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, సీతంపేట, బుట్టాయగూడెం, పోలవరం వంటి ఏజెన్సీ మండలాల్లో ఈ పండుగ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొండరెడ్లు, బగత, కొండదొర, వాల్మీకి, మాలి, సవర తదితర గిరిజన తెగలు చెట్టుకు మామిడికాయలు కాసినా, పండినా,ఈపండుగ పూర్తయ్యే వరకు వాటిని కోయరు, తినరు.
