Headlines

సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ.. ఇదిగో వీడియో | Not a Movie Scene: Police Save Youth Seconds Before Train Accident in Visakhapatnam


విశాఖపట్నంలో సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్‌లో ఒక యువకుడి ప్రాణం తృటిలో తప్పింది. మల్కాపురం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ వైపు వెళ్లాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో అలర్ట్ అయిన సీపీ బాగ్చి, మొబైల్ లొకేషన్ ఆధారంగా రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఒకవైపు రైలు వేగంగా వస్తుండటం, మరోవైపు యువకుడు దానికి ఎదురెళ్లడం గమనించిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు రైల్వే ట్రాక్‌పై అర కిలోమీటరు మేర పరుగు తీశారు. రైలు కేవలం 50 మీటర్ల దూరంలో ఉందనగా యువకుడిని పక్కకు లాగేసి ప్రాణాలు కాపాడారు.

విశాఖపట్నంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన రాజేష్ అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిటీ పోలీస్ కమిషనర్ (సీపీ) బాగ్చి.. యువకుడి మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయగా, అతను రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే రైల్వే క్రైమ్ వింగ్‌కు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఎస్సై మీనా, ఏఎస్ఐ ఉమామహేశ్వరరావుల బృందం వెంటనే గాలింపు చర్యలు చేపట్టింది. యువకుడి ఫోన్‌కు కాల్ చేయగా ఒకసారి లిఫ్ట్ చేసి కట్ చేశాడు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో రైలు ఇంజిన్ శబ్దాలు రావడంతో అతను ట్రాక్‌పైనే ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు.

పోలీసులు వెతుకుతుండగా.. దూరంగా ఒక యువకుడు వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా పరుగెత్తడం కనిపించింది. సెకన్ల వ్యవధిలో రైలు అతనికి దగ్గరవుతోంది. ఆ ప్రమాదకర పరిస్థితిని గమనించిన ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు.. ట్రాక్ పక్కన ఉండే పెద్ద పెద్ద కాంక్రీట్ రాళ్లను కూడా లెక్కచేయకుండా దాదాపు అర కిలోమీటరు మేర వేగంగా పరుగు తీశారు. రైలు యువకుడికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉందనగా, ఏఎస్ఐ ఉమామహేశ్వరరావు చివరి క్షణంలో ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని ట్రాక్ పైనుంచి పక్కకు లాగేశారు. ఆ తర్వాతి సెకనులోనే రైలు అక్కడ నుండి దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న యువకుడిని రైల్వే స్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ విజయవంతం కావడంతో ఉన్నతాధికారులు ఎస్సై మీనా, ఏఎస్ఐ ఉమామహేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, స్థానికులు ఆ యువకుడికి భూమిపై నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి.. దేవుడిలా వచ్చి కాపాడిన పోలీసులకు సలాం అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *