Headlines

HCUలో ల్యాప్‌టాప్‌లు చోరీ.. తెల్లారేసరికి క్యాంపస్‌ చెరువులో విద్యార్ధి మృతదేహం! ఏం జరిగిందో? | HCU student ends life on campus amid laptop theft dispute


గచ్చిబౌలి, మే 20: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ రీడింగ్‌ రూంలో గతంలో రెండు ల్యాప్‌ టాప్‌లు దొంగతనం జరిగాయి. ఓ విద్యార్ధి వాటిని చోరీ చేశాడని అందరూ ఆ విద్యార్ధిని టార్గెట్‌ చేశారు. తాజాగా హాస్టల్‌లో మరో ల్యాప్‌టాప్‌ పోవడంతో సదరు విద్యార్ధిపై దొంగ అని ముద్ర వేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత విద్యార్ధి యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన విద్యార్ధిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్ కుందు (23)గా గుర్తించారు. మయాంక్ హెచ్‌సీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎఫ్‌ హాస్టల్‌లోని రూమ్‌ నంబర్‌ 242లో సెకండ్‌ ఇయర్‌ విద్యార్థి సుప్రతి లోహతో కలిసి ఉంటున్నాడు.

Read also: దారుణం.. ఆడుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లిన ఏడేళ్ల బాలుడు..! కాసేపటికే ఘోరం

మే 17న రీడింగ్‌ రూమ్‌లో రెండు ల్యాప్‌టాప్‌లు మయాంక్‌ చోరీ చేశాడని ఇద్దరు లైఫ్‌ సైన్స్‌ విద్యార్థులు వర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ ల్యాప్‌టాప్‌లు తిరిగి ఇవ్వాలని విద్యార్థులు కోరారు. అయితే మయాంక్‌ మాత్రం ఆ ల్యాప్‌టాప్‌ల విషయం తనకు తెలియదని చెప్పాడు. ల్యాప్‌టాప్‌లు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు హాస్టల్‌ నుంచి వెళ్లిన మయాంక్‌ తిరిగి రాలేదు. మరోవైపు ల్యాప్‌టాప్‌లు పోయాయని లైఫ్‌ సైన్స్‌ విద్యార్థులు సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్‌ నుంచి వెళ్లిన మయాంక్‌ వర్సిటీ క్యాంపస్‌లోని బఫెల్లో లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవి కూడా చదవండి

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరువులో మయాంక్‌ మృతదేహం తేలుతూ కనిపించడంతో వర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *