Headlines

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ! | Delhi high court justice swarana kanta sharma initiates contempt proceedings against arvind kejriwal and other aap leaders


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (లిక్కర్) కేసు విచారణలో అత్యంత నాటకీయ, కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు (Recusal) ఆమె అధికారికంగా ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై, న్యాయవ్యవస్థపై జరిగిన తీవ్ర దుష్ప్రచారం, అవమానకర వ్యాఖ్యలు, కోర్టు ధిక్కారణ చర్యల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

తాను కేసు నుంచి తప్పుకోకపోతే, నిందితులపై తనకు ఏదో పగ ఉందనే తప్పుడు సంకేతాలు సమాజంలోకి వెళ్తాయని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు కోరారు కాబట్టి తాను తప్పుకోవడం లేదని.. కోర్టు ధిక్కారణకు పాల్పడుతూ, వ్యవస్థలను కించపరిచేలా వ్యవహరించడం వల్లే వైదొలుగుతున్నానని ఆమె స్పష్టం చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, వినయ్ మిశ్రా తదితరులపై సోషల్ మీడియాలో న్యాయమూర్తిని, కోర్టును అవమానించేలా పోస్టులు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇప్పటికే సదరు నేతలకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేశారు. న్యాయవ్యవస్థపై బురదజల్లడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, ఈ బెంచ్‌పై ఆప్ నేతలు మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహారిస్తున్నారంటూ ఆరోపించారు. బెంచ్ మార్చాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) కోరారు. అక్కడ సానుకూల స్పందన రాకపోవడంతో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ తర్వాత హైకోర్టులో అధికారికంగా కేసు నుంచి తప్పుకోవాలని (రిక్యూజల్) పిటిషన్ కూడా వేశారు.

జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆర్‌ఎస్‌ఎస్ (RSS)తో సంబంధాలు ఉన్నాయని, ఆమె పిల్లలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ బీజేపీ నుంచి లబ్ధి పొందుతున్నారంటూ ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను న్యాయమూర్తి పూర్తిగా తిరస్కరించారు. రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు సరికాదంటూ.. ఏప్రిల్ 20న కేజ్రీవాల్ సహా నిందితుల రిక్యూజల్ అభ్యర్థనను కొట్టివేశారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన ఆప్ నాయకులు తాము కోర్టు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఫిబ్రవరి 23న రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్, సిసోడియా, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితతో సహా 23 మంది నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ అప్పీల్‌పైనే ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన విచారణ జరుగుతోంది.

ఇప్పుడు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసు నుంచి తప్పుకోవడంతో, ఈ హైప్రొఫైల్ కేసు విచారణ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మరో కొత్త ధర్మాసనానికి కేటాయించనున్నారు. న్యాయమూర్తి తీసుకున్న ఈ నిర్ణయం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *