ప్రకాశం జిల్లా: సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన యువకులను సముద్ర అలలు మృత్యువు రూపంలో కబళించాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో జరిగిన ఈ విషాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
పోలేరమ్మ కొలుపుల అనంతరం సముద్ర స్నానానికి..!
వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురానికి చెందిన సుమారు 60 మంది పోలేరమ్మ కొలుపులు నిర్వహించుకున్న అనంతరం సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఎనిమిది మంది యువకులు సముద్రంలోకి దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలల ఉద్ధృతికి నీట మునిగిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
ఐదుగురిని రక్షించిన మత్స్యకారులు
యువకులు నీట మునిగిపోవడాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఐదుగురిని బయటకు తీసుకువచ్చి ఆసుపత్రులకు తరలించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మృతులను పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22)గా గుర్తించారు. గల్లంతైన వారిని దేవేండ్ల విష్ణు (16), దేవేండ్ల నారాయణ (30)గా గుర్తించారు. వీరి కోసం మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు.
గ్రామంలో విషాద ఛాయలు
ప్రాణాలతో బయటపడిన మరో నలుగురికి కందుకూరు, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యులు 24 గంటల పాటు పరిశీలనలో ఉంచాలని నిర్ణయించారు. సంతోషంగా కొలుపులు నిర్వహించుకుని బీచ్‌కు వెళ్లిన వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మరో ఇద్దరు గల్లంతవడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..
