Headlines

పండగ వేళ ఉన్మాదం.. ఆ గ్రామంలో భగ్గుమంటున్న రాజకీయ కక్షలు.. బతుకమ్మ తల్లి విగ్రహం ధ్వంసం! | Mahabubabad: Bathukamma Idol Vandalized Amid Political Rivalry, Outraging Telangana


Bathukamma Idol: తెలంగాణ ఆత్మగౌరవ గౌరవ ప్రతీక.. ఆడబిడ్డలకు అత్యంత ప్రీతికరమైన వేడుక.. బతుకమ్మ సంబరాలకు ఆడబిడ్డలంతా సిద్ధమవుతున్న వేళ మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ దారుణ సంఘటన అందరినీ ఆగ్రహానికి గురిచేస్తుంది. రాజకీయ కక్షలతో బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. బండరాళ్లతో తల్లి బిడ్డల బతుకమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఉన్మాద చర్య పట్ల ఊరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో జరిగింది. గ్రామ శివారులో ప్రతియేటా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం కోసం గ్రామ సర్పంచ్ మంజుల రవి బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం వద్దకు చేరుకొని బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతోంది.

అయితే గ్రామంలో భగ్గుమంటున్న రాజకీయ కక్షలతో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తుతెలియని ఉన్మాదులు. సర్పంచ్ కుటుంబంపై ఉన్న కోపమంతా ఆడబిడ్డల అస్తిత్వం పై చూపారు. విగ్రహాన్ని రూపం కోల్పోయేలా బండరాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలంతా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న వేల ఈ ఘటన అందరినీ ఆగ్రహానికి గురి చేస్తుంది. ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంతో పాటు కిందభాగంలో గ్రామ సర్పంచ్ మంజుల రవి పేరుతో ఉన్న శిలాఫలకాన్ని పగలగొట్టారు ఆ దుండగులు. బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ద్వందంచేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *