Headlines

సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని దారుణ హత్య.. కర్రలతో తలపై దాడి చేసి మర్డర్‌ | Man Murdered in Chevella for Refusing to Share Mobile Phone Password


చేవెళ్ల, అక్టోబర్‌ 9: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం ఫోన్‌ను మంటల్లో పడేశారు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..

బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో చేవెళ్ల బస్‌స్టాండ్‌ వద్ద 43 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి నుంచి కొందరు దుండగులు సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అనంతరం అతడిని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కందవాడ వార్డులో ఉన్న డంపింగ్‌ యార్డు షెడ్డులోకి తీసుకెళ్లారు. బాధితుడి ఫోన్‌ లాక్‌ తెరవడానికి పాస్‌వర్డ్‌ చెప్పాలని దుండగులు ఒత్తిడి తెచ్చారు. అయితే అతడు పాస్‌వర్డ్‌ చెప్పేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన నిందితులు కర్రలతో అతడి తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.

హత్య అనంతరం నిందితులు బాధితుడి సెల్‌ఫోన్‌ను డంపింగ్‌ యార్డులో మంటల్లో పడేశారు. గురువారం మధ్యాహ్నం నిందితుల్లో ఒకరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలేమిటి అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మొబైల్‌ ఫోన్‌ పాస్‌వర్డ్‌ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీయడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *