Headlines

రాజమహేంద్రవరం నుంచి పైలట్లకు రెక్కలు.. రాష్ట్ర తొలి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకి శ్రీకారం! | AP first pilot training centre in Rajamahendravaram, foundation stone laid for FTO at a cost of rs100 crore


తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం సమీపంలో రాష్ట్రంలోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కోరుకొండ మండల పరిధిలో రూ.100 కోట్ల పెట్టుబడితో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ పైలట్ శిక్షణ కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఏవియేషన్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ల కొరతను తీర్చేందుకు ఈ శిక్షణ కేంద్రం కీలకంగా మారుతుందన్నారు. ఆరు నెలల్లో అకాడమీని అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు. తొలి దశలో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏడాది వంద మందికి పైగా పైలట్లను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కేంద్రం పనిచేస్తుందని పురందేశ్వరి చెప్పారు.

భవిష్యత్తులో పైలట్ శిక్షణతో పాటు ఎయిర్ హోస్టెస్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బంది, విమాన సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.

Mp Purandheswari

Mp Purandheswari

జార్విస్ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఫణీంద్ర మాట్లాడుతూ, సుమారు 1.25 ఎకరాల విస్తీర్ణంలో ఈ అకాడమీని నిర్మిస్తున్నామని తెలిపారు. శిక్షణ కోసం ఆరు విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఐదు నెలల్లో అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ అందించి తొలి విడతలో రెండు బ్యాచ్‌లుగా 70 మందికి పైలట్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఫీజు సుమారు రూ.60 లక్షలకు పైగా ఉండొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *