Headlines

మిస్సింగ్ అని ఆశ పెట్టారు..చివరకు మృతదేహం గుర్తించామని చెప్పారు! సురేష్ మృతితో విషాదసాగరం | He Said He Would Return in 10 Days, But Never Came Back: Visakhapatnam Engineer Killed in Oman Attack


సాగర తీరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం నింపిన ఘటన వెలుగుచూసింది. పది రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చి వెళ్లిన ఒక ఇంజనీర్, విధి నిర్వహణలో ఉండగా దేశం కాని దేశంలో జరిగిన క్షిపణి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఒక పెద్ద నౌకపై అమెరికా చేసిన క్షిపణి దాడిలో విశాఖపట్నం శ్రీహరిపురానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. ఈ దాడిలో మరణించిన ముగ్గురిలో సురేష్ ఒకరు.

అయ్యో పాపం అనుకుంటే.. తన భర్తేనని తెలిసి..

ఒమన్ తీరంలో నౌకపై దాడి జరిగి ముగ్గురు గల్లంతయ్యారనే వార్తను టీవీల్లో చూసి, అయ్యో పాపం అనుకున్నారు సురేష్ భార్య భార్గవి. కానీ, ఆ ప్రమాదంలో చిక్కుకున్నది తన భర్తేనని ఆమె ఊహించలేకపోయారు. మొదట భర్త మిస్సింగ్ అయ్యారని, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని సమాచారం రావడంతో ఎక్కడో ఒక చిన్న ఆశ మిగిలింది. కానీ, అంతలోనే ఆయన మృతదేహాన్ని గుర్తించారనే చేదు వార్త వినాల్సి వచ్చింది. సురేష్ మరణంతో భార్య భార్గవి, ఇద్దరు కుమారులు నయన్ (13), జతిన్ (10) ఒంటరివారయ్యారు.

నలుగురు పిల్లలకు పెద్దదిక్కు..

సురేష్ కేవలం తన ఇద్దరు పిల్లలకే కాదు, భార్య అక్కాబావ చనిపోవడంతో అనాథలైన వారి ఇద్దరు ఆడపిల్లలు హరిప్రియ, హేమసాయిప్రియలను కూడా సొంత బిడ్డల్లా సాకుతున్నారు. ఇప్పుడు ఆ నలుగురు పిల్లలకు, కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. గతంలో యెమెన్ పోర్టులో ట్యాంక్ పేలినప్పుడు తృటిలో తప్పించుకున్న సురేష్, ఈసారి వార్ జోన్‌లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడాన్ని భార్య తట్టుకోలేకపోతోంది.

ఇవి కూడా చదవండి

తల్లి గుండె కోత..

నా కొడుకు చిన్నప్పటి నుంచి సీమెన్ అవ్వాలని కోరుకున్నాడు. ఎక్కడున్నా సరే రోజు ఉదయాన్నే నాకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టేవాడు. రెండు రోజుల నుంచి మెసేజ్ రాలేదు అంటూ సురేష్ తల్లి రామలక్ష్మి ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. అధికారులు చూపించిన ఫోటో తన కొడుకుది కాదని, వాడు క్షేమంగా తిరిగి వస్తాడని ఆ తల్లి ఇంకా ఆశతో ఎదురుచూడటం అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.

ఎంతోమందికి పని నేర్పించి, ఆప్యాయంగా ఉండే సురేష్ మరణంతో శ్రీహరిపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సురేష్ భౌతికకాయాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని స్థానికులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *