Headlines

Vinukonda: గోడకు కన్నం పెట్టి బంగారం షాపులోకి దూరారు.. కానీ లోపల విచిత్రంగా… | Thieves Dig Hole Through Wall, Rob Jewellery Showroom in Vinukonda


మూడేళ్ల క్రితం పల్నాడు జిల్లా వినుకొండ దక్షిణ బజార్‌లో రాహుల్ రెడ్డి, వెంకట శివరెడ్డి కలిసి బంగారు వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం వ్యాపారాన్ని విస్తరించి “వేక్షిత జ్యూయలర్స్” పేరుతో ఆధునిక షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం రాత్రి షాపును మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం షాపుకు వచ్చి చూడగా, షట్టర్ యథావిధిగా మూసి ఉన్నప్పటికీ లోపల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. షోరూమ్ పక్కనే ఉన్న మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకున్న దొంగలు, గోడకు కన్నం వేసి అందులో నుంచి షాపులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దొంగలు లాకర్‌లో ఉన్న భారీ బంగారు ఆభరణాలను తాకకుండా, వెండి వస్తువులతో పాటు చిన్న చిన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. అనంతరం వచ్చిన కన్నం ద్వారానే బయటకు వెళ్లిపోయారు.

చోరీకి సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దొంగలు షాపులో ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను కూడా తమతో తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు షాపులో కారం పొడి చల్లి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మెట్ల మార్గం నుంచి లారీ ఆఫీస్ వైపు దొంగలు వెళ్లినట్లు ఆనవాళ్లు లభించాయి. డాగ్ స్క్వాడ్ కూడా లారీ ఆఫీస్ నుంచి చెక్‌పోస్ట్, డిగ్రీ కాలేజ్ మీదుగా నూజెండ్ ఆర్వోబీ నిర్మాణ ప్రాంతం వరకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. దీనితో అక్కడి నుంచి దొంగలు వాహనాల్లో పరారై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *