Headlines

Vijayawada: విజయవాడలో అట్టాహాసంగా ఉత్సవ్ 2.0.. ఏపీ ప్రభుత్వానికి మోదీ కీలక లేఖ.. | Vijayawada Utsav 2.0: PM Narendra Modi Congratulates Andhra Pradesh Government, Check Event Highlights


విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు. ఏపీలో ఈ వేడుకలు నిర్వహించడం సంతోషకరమని, ఇందుకుగాను సీఎం చంద్రబాబును అభినందిస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ చొరవకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఏపీ ఆర్థిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందని కితాబిచ్చిన మోదీ.. ఈ ఉత్సవ్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఉత్సవ్ విజయవాడ ప్రజలు, సాంస్కృతిక వారసత్వానికి మధ్య బంధాన్ని ఇది బలపరుస్తుందని మోదీ తెలిపారు. ఇందుకుగాను ఏపీ ప్రభుత్వాన్ని అభినందనలు తెలిపారు. కాగా విజయవాడలోని సింగ్‌నగర్‌ మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఉత్సవ్‌ 2.0 వేడుకలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ఉత్సవ్‌ను ప్రారంభించనున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతమిచ్చేలా ఈ ఉత్సవ్‌ను గ్రాండ్‌గా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అటు ఇప్పటికే సిటీలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు పాల్గొంటున్నారు. విజయవాడ  ఉత్సవ్‌ 2.0 పేరుతో ఈ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.  నేటి నుంచి ఈ ఉత్సవ్ ప్రారంభం కానుంది. ఈ వేడుకలు స్థానిక కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు సందర్శకులకు విభిన్న అనుభూతులను అందించేలా రూపొందించారు. పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నృత్య సంగీత విభావరులు, మ్యూజిక్ కన్సర్ట్‌లు, లైవ్ కబడ్డీ, వాలీబాల్ ప్రదర్శనలు జరగనున్నాయి. చివరి రోజు మైసూరు దసరా తరహాలో గజరాజులతో కూడిన కార్నివాల్‌ను నిర్వహించనున్నారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ఉత్సవాలకు ఆహ్వానించారు.

ఈనెల 13న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విజయవాడ ఉత్సవాల్లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈనెల 14న రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడకు రానున్నారు. అదే రాత్రి ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. మరుసటి రోజు కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన సరస్ మేళాను ఆమె ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆహార అలవాట్లకు సంబంధించిన స్టాల్స్‌తో పాటు, భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో దాదాపు 600 సరస్ మేళా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా ఒకేసారి వచ్చాయి. నవరాత్రుల సందర్భంగా అన్ని షాపులు కూడా విజయవాడ ఉత్సవ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నగరంలోని రోడ్లను దీపాలతో అలంకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *