Headlines

Kishan Reddy: రాహుల్‌కు రాజ్యాంగ సంస్థలపై నమ్మకం లేదా..? ఓటములకు ఈసీని నిందిస్తారా.. కిషన్ రెడ్డి ఫైర్.. | Union Minister Kishan Reddy Slams Rahul Gandhi: Stop Blaming Constitutional Institutions for Your Poll Defeats


కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తన రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పులు లేదా నిర్ణయాలు వస్తే వాటిని ప్రజాస్వామ్యబద్ధమైనవని పొగడటం, ప్రజలు తిరస్కరించినప్పుడు అవే సంస్థలను అవినీతిమయమని ఆరోపించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో వరుస పరాజయాలను జీర్ణించుకోలేక రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేకే దేశ ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పదే పదే తిరస్కరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని గెలిపించడమో లేదా ప్రధానమంత్రిని చేయడమో ఎన్నికల సంఘం బాధ్యత కాదని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడమే దాని విధి అని స్పష్టం చేశారు. ఓట్లు సంపాదించడం, ప్రజా మద్దతు పొందడం పూర్తిగా నాయకుడి బాధ్యత అని, అందులో రాహుల్ ఘోరంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.

న్యాయస్థానాలు, కాగ్‌లను సైతం వదల్లేదు

రాజ్యాంగబద్ధమైన తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విశ్వసనీయతను సైతం శంకించడం కాంగ్రెస్ నైజమని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రాఫెల్ ఒప్పందంపై కాగ్ నివేదిక కాంగ్రెస్ రాజకీయ ఆరోపణలకు మద్దతు ఇవ్వలేదనే కారణంతో దాన్ని చౌకీదార్ ఆడిటర్ జనరల్ అంటూ గేలి చేశారని ఆక్షేపించారు. ఐఐటీలు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వంటి అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలతో పాటు, భారత సైన్యాన్ని సైతం రాజకీయ లబ్ధి కోసం కించపరిచేలా రాహుల్ వ్యవహరించారని మండిపడ్డారు.

విదేశీ వేదికలపై దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు

సొంత రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ గాంధీ విదేశీ గడ్డలను, అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలాయంటూ విదేశాల్లో దుష్ప్రచారం చేయడం ద్వారా దేశంలోకి వచ్చే పెట్టుబడులను, అభివృద్ధిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

రాచరిక మనస్తత్వం ఇంకా పోలేదు

గతంలో కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను మీడియా ముందే చించివేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రాహుల్ అవమానించారని, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు భౌతికకాయానికి సైతం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గౌరవం దక్కలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ‘‘భారతదేశం ప్రజాస్వామ్య దేశం.. మీ కుటుంబం పాలించాల్సిన రాచరికం కాదు. ప్రజలు తిరస్కరించిన తీర్పును గౌరవించడమే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి’’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం.. దేశం, ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ నిలబడతాయని.. అవినీతి, కుటుంబ పాలనను భారత ప్రజలు ఎప్పటికీ మళ్లీ రానివ్వరని ఆయన తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *