Headlines

Bullet Trains: హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ల కారిడార్లు.. బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. త్వరలోనే.. | Hyderabad Bullet Train Update: Centre Clarifies Land Acquisition Rules for Hyderabad to Chennai, Bengaluru and pune Corridors


భవిష్యత్తులో రానున్న బుల్లెట్ ట్రైన్లకు హైదరాబాద్ పెద్ద హబ్‌గా మారనుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏకంగా మూడు బుల్లెట్ ట్రైన్ల కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె కారిడార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఈ కారిడార్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అలైన్‌మెంట్, భూసేకరణపై కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అలైన్‌మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన ఎక్స్‌లో కేంద్రమంత్రుల భేటీకి సంబంధించి ఒక పోస్ట్ చేసింది.

అలైన్‌మెంట్ల ఖరారు తర్వాత భూసేకరణ

ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైలకు కనెక్టివిటీ కల్పిస్తూ ప్రతిపాదించిన హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు సంబంధించి అలైన్‌మెంట్లపై చర్చించారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్ ఖరారు కోసం చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత భూసేకరణ ప్రారంభమవుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలైన్‌మెంట్ ఫిక్స్ అయిన తర్వాత భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. ప్రతిపాదనలు లేకుండా భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్దమని, హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ పేరుతో ఎవరైనా భూమిని సేకరిస్తే అది ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అలైన్‌మెంట్ ఫిక్స్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు.

రైతుల్లో ఆందోళన..

అయితే బుల్లెట్ ట్రైన్ మార్గానికి సంబంధించి పొలాల్లో మార్కింగ్ పనులు చేపట్టడంతో రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. భూములు కోల్పోతామోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా అలైన్‌మెంట్, మార్కింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి దృష్టికి కిషన్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్ ఖరారు అయిన తర్వాత ప్రభుత్వాలు, రైతులకు పూర్తి సమాచారం అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అటు సూర్యాపేట మీదుగా బుల్లెట్ రైలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాథమికంగా రూపొందించిన అలైన్‌మెంట్‌లో సూర్యాపేటను చేర్చినప్పటికీ.. ఆ తర్వాత మార్పులు చోటుచేసుకున్న విషయాన్ని రైల్వేశాఖ మంత్రికి కిషన్ రెడ్డి వివరించారు. కాగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ఏపీ మీదుగా వెళ్లనుంది. దీంతో ఏపీ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *