Headlines

వరుస నేరాలకు చెక్.. ముగ్గురిపై పీడీ యాక్ట్, నేరస్థులకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్! | Vizianagaram Police Crack Down on Repeat Offenders: PD Act Invoked Against Three Habitual Criminals


విజయనగరం జిల్లాలో వరుస నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపారు. వరుసగా దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అలవాటు ఉన్న నేరస్థులపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వేపాడ మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేసి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. బొద్దాం గ్రామానికి చెందిన మహ్మద్ అహ్మద్ (26), పాటూరు గ్రామానికి చెందిన కర్రి యోగేంద్ర (28), రుద్ర బంగారునాయుడు పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై గతంలోనే హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు నమోదు అయ్యాయి. ఒక్కొక్కరిపై దాదాపు 15కుపైగా దొంగతనం కేసులు ఉన్నాయి. వీరు తరచూ నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో నేరాలను నివారించేందుకు ముందస్తు చర్యగా పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని నిర్బంధించారు. గతంలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పలువురుపై ఇదే తరహా పీడీ యాక్ట్ ప్రయోగించి నిర్బంధించారు.

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భూ దురాక్రమణలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నేరస్థుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట హిస్టరీ షీట్లు, పీడీ యాక్ట్ వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నేర చరిత్ర ఉన్నవారు తమ ప్రవర్తన మార్చుకుని చట్టాన్ని గౌరవించాలని, లేకపోతే మరింత కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *