.
న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినాశనానికి వ్యూహం రచించిన ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (డి-కంపెనీ) నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

అరెస్ట్ అయిన వారిలో దిల్లీ, ముంబయి, పంజాబ్‌కు చెందిన వారితో పాటు నేపాల్ దేశానికి చెందిన విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి భారీగా అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను రికవరీ చేశారు.

హై అలర్ట్‌లో దేశ రాజధాని
గత ఏడాది నవంబరు 10న దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 15 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకుని, మళ్లీ అలాంటి విద్రోహ చర్యలు పునరావృతం కాకుండా భద్రతా సంస్థలు కొన్ని వారాలుగా నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక ‘కౌంటర్ టెర్రర్ యూనిట్లు’ (CTUs) ఏర్పాటయ్యాయి. ఈ పక్కా నిఘా వల్లే తాజాగా ఈ ఉగ్ర మాడ్యూల్ గుట్టు రట్టయింది.
ప్రస్తుతం పట్టుబడిన ఉగ్రవాదుల బ్యాంక్ ఖాతాలను, వీరికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయనే కోణంలో దిల్లీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలతో అధికారిక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
