Headlines

NEET re-Exam 2026: నీట్‌ రీఎగ్జామ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యేది ఎప్పుడంటే? ఎన్‌టీఏ కీలక ప్రకటన | NEET UG 2026 Re exam: Admit Card Will Be Issued By June 14


హైదరాబాద్‌, మే 16: పేపర్‌ లీక్‌ ఆరోపణలతో మే 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను మే 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్‌ ప్రకారం నీట్‌ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్‌ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా వెల్లడించారు. ఈసారి పరీక్షను మరింత పకడ్బందీగా, మాల్‌ ప్రాక్టీస్‌కు తావు లేకుండా నిర్వహిస్తామని, పరీక్ష సమయాన్ని కూడా 15 నిమిషాలు పెంచామని ఆయన చెప్పారు. విద్యార్థులంతా ఎలాంటి భయం లేకుండా పరీక్షకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

జూన్‌ 21న నీట్ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలోనే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనున్నట్లు ఎన్టీయే తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు జూన్‌ 14వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. పేపర్‌ లీక్‌ కేసును సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తుందని, ఎవరినీ వదిలిపెట్టబోమని, విద్యార్థుల భవిష్యత్తే మాకు అత్యంత ప్రాధాన్యమని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే మే 15 నుంచి మే 21రాత్రి 11:50 గంటల వరకు అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలను మార్చుకోవచ్చని తెలిపింది. మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్య నగరాలను ఎంపిక చేసుకోవచ్చు. చిరునామా, పరీక్షా కేంద్రం తప్ప మిగతా వివరాలు మార్చడానికి లేదని పేర్కొంది. నీట్‌ పరీక్ష రద్దు కావడంతో ఆ పరీక్ష ఫీజును తిరిగి చెల్లిస్తామని వివరించింది. అయితే జూన్‌ 21న రాసే రీ-ఎగ్జామినేషన్‌కు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఎన్టీయే తన సొంత నిధులతో ఈ పరీక్ష నిర్వహిస్తుందని చెప్పింది. అయితే తిరిగి కొత్తగా జరుగుతున్న నీట్‌ ఎగ్జామినేషన్‌ ఫలితాలను ఎప్పుడు వెల్లడిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎన్‌టీఏ త్వరలో వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *