Headlines

Suryakumar Yadav : సూర్యకుమార్ కెప్టెన్సీ ఊడేనా? టీమిండియా టీ20 సారథిగా ముంబై ఇండియన్స్ కుర్రాడు | Suryakumar yadav t20 captaincy danger gautam gambhir decision tilak varma shubman gill race telugu


Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్సీ మార్పుల సెగ మొదలైంది. ప్రస్తుత సారథి సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై బీసీసీఐ సెలెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా ఫామ్ కోల్పోవడం, బ్యాటింగ్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దుకోకపోవడంతో అతడిని కేవలం బ్యాటర్‌గా కూడా జట్టులో కొనసాగించడం కష్టమేనని సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు జాతీయ వార్తా సంస్థ పీటీఐ ఒక సంచలన నివేదికను వెల్లడించింది.

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయం పైనే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు ఆధారపడి ఉందని బీసీసీఐ సీనియర్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా సూర్య మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని సెలెక్టర్లు ఆశించినప్పటికీ, అతడి ప్రదర్శన నిరాశాజనకంగానే సాగింది. మామూలు బౌలర్లు వేసే సాధారణ బంతులను సైతం ఎదుర్కోవడానికి సూర్య తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఆడే భారత జట్టులో అతడికి చోటు కల్పించడం కష్టమేనని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి కొత్త నీరు తీసుకురావాలనే చర్చలు నడుస్తున్నాయి.

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌లో అతడి సహచర ఆటగాడైన తిలక్ వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. బీసీసీఐ పెద్దల సర్కిల్‌లో తిలక్ వర్మ పేరుకు మంచి మద్దతు లభిస్తోంది. అందువల్లే రాబోయే ముక్కోణపు ‘ఎ’ సిరీస్‌కు తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారని, అక్కడ అతడి లీడర్‌షిప్ స్కిల్స్‌ను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగిస్తే మాత్రం తిలక్ వర్మకు జాక్‌పాట్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.

కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మతో పాటు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్‌కు వ్యూహాత్మకంగా మంచి పట్టు, బలమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, కోచ్ గంభీర్‌తో అతడి కెమిస్ట్రీ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచినప్పుడు క్రెడిట్ అంతా మెంటార్ గంభీర్‌కే వెళ్లడంపై అయ్యర్ అసంతృప్తిగా ఉన్నాడనే ప్రచారం ఉంది. మరోవైపు ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును సమర్థవంతంగా నడిపించిన శుభ్‌మన్ గిల్ వైపు కూడా సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు. గతంలో గిల్‌ను భవిష్యత్తు ఆల్-ఫార్మాట్ కెప్టెన్‌గా భావించినప్పటికీ, టీ20 ప్రపంచకప్‌కు ముందు ఫామ్ కోల్పోవడంతో ఆ ప్రణాళికలు వెనక్కి తగ్గాయి.

ఒకవేళ సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పిస్తే టీ20 బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్‌ను తిరిగి జట్టులోకి తెచ్చి ఓపెనర్‌గా పంపాలని థింక్ ట్యాంక్ యోచిస్తోంది. అలాగే మూడో స్థానంలో సంజూ శాంసన్, నాలుగో స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటికి తోడు టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని కూడా ఒలింపిక్స్ ప్రణాళికల్లో భాగంగా ఫాస్ట్ ట్రాక్ ద్వారా జట్టులోకి తీసుకురావాలని సెలెక్టర్లు చూస్తున్నారు. ప్రస్తుతానికి సూర్యకు కెప్టెన్‌గా మరో సిరీస్ అవకాశం ఇవ్వాలా లేదా అనే తుది నిర్ణయం కోచ్ గంభీర్ చేతుల్లోనే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *