Headlines

Srikakulam: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాకే.. | Srikakulam Woman Robs 75 Year Old After Posing As Tenant


శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ మహిళ అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి వృద్ధురాలిపై దోపిడీకి పాల్పడింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న 75 ఏళ్ల యడ్ల వరలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని, ఆమె కంటిలో కారం చల్లి మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారైంది. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడు రోజుల ముందే ఇంటి పరిశీలన!

శ్రీకాకుళంలోని గోవిందనగర్ ప్రాంతానికి చెందిన యడ్ల వరలక్ష్మి నివాసంలోని పై అంతస్తు పోర్షన్ ఖాళీగా ఉంది. ఇదే విషయాన్ని గమనించిన నిందితురాలు.. మూడు రోజుల క్రితం అద్దెకు ఇల్లు కావాలంటూ ఆమె ఇంటికి వచ్చి మాట్లాడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? వృద్ధురాలు ఒంటరిగా ఎప్పుడు ఉంటారు? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే పథకం వేసుకుని దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నారు.

కంటిలో కారం చల్లి.. బంగారు పుస్తెలతాడుతో పరార్

గురువారం దోపిడీకి కొన్ని గంటల ముందు నిందితురాలు అదే వీధిలో తిరుగుతూ పరిస్థితులను గమనించినట్లు సమాచారం. జన సంచారం తక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి కంటిలో కారం చల్లింది. ఆమె ప్రతిఘటించలేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని అక్కడి నుంచి పరారైంది.

దాడితో భయాందోళనకు గురైన వరలక్ష్మి ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. వీధిలోని సీసీ కెమెరాల్లో నిందితురాలి కదలికలతో పాటు, దోపిడీ అనంతరం బాధితురాలు ఇంటి నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. నిందితురాలిని గుర్తించేందుకు ఈ దృశ్యాలు పోలీసులకు కీలక ఆధారాలుగా మారనున్నాయి.

రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్

బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పైడపు నాయుడు, ఎస్ఐ సురేష్ బాధితురాలిని కలిసి ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ సైతం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును వారం రోజుల్లో ఛేదించేందుకు కృషి చేస్తున్నట్లు సీఐ పైడపు నాయుడు తెలిపారు.

సీసీ కెమెరాలు లేకపోవడం దొంగలకు అవకాశమా?

శ్రీకాకుళంలోని గోవిందనగర్, ఎస్‌బీఐ కాలనీలలో సీసీ కెమెరాలు తక్కువగా ఉండటంతో దొంగతనాలకు పాల్పడేవారికి అవకాశం కలుగుతోందని సీఐ పైడపు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో గతంలోనూ పలు చోరీలు జరిగినట్లు తెలిపారు. గోవిందనగర్‌లో గతంలో 24 దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న దున్న కృష్ణ ప్రస్తుతం జైలులో ఉన్నాడని వెల్లడించారు.

వృద్ధులు, ఒంటరిగా ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి

ఇటీవలి కాలంలో బంగారు ఆభరణాల కోసం వృద్ధులు, ఒంటరిగా నివసించే మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చే అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎప్పుడు ఖాళీగా ఉంటుంది వంటి వ్యక్తిగత వివరాలను తెలియని వారికి చెప్పకపోవడం మంచిది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. శ్రీకాకుళంలో వృద్ధురాలిపై జరిగిన ఈ దోపిడీ కేసులో నిందితురాలిని గుర్తించి, బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *