Headlines

Andhra Pradesh: ఆ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. నో వెహికల్ డే.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. | AP Chandrababu Govt Announces ‘No Vehicle Day’ and Work From Home Measures to Promote Fuel Savings


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పొదుపు బాట పట్టింది ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మనదేశం-మన బాధ్యత పేరుతో పలు నిర్ణయాలను ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా వనరుల ఆదాపైనే చర్చ జరిగింది. కాన్వాయ్‌ల తగ్గింపుతో సరిపోదన్న ముఖ్యమంత్రి మరిన్ని పొదుపు చర్యలను సూచించారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటిద్దామని, కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని, అవసరమైతే సెక్రటేరియట్‌కి సైకిల్ మీద రావాలన్నారు చంద్రబాబు. ప్రతి శుక్రవారం నో వెహికల్‌ డే గా అనుసరించాలని సూచించారు. విద్యుత్ కంటే.. సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని.. చంద్రబాబు అధికారులకు సూచించారు.

అధిక సంఖ్యలో సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతోపాటు ప్రెజెన్స్‌ అవసరం లేని ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్‌ కటింగ్‌ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమంది అధికారులు నాలుగైదు కార్లు వినియోగిస్తున్నారని.. ఇకపై ఒక అధికారికి ఒక అధికారిక వాహనమే ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ బాటలో చంద్రబాబు, పవన్ కల్యాణ్

కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు సూచనలతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు కీల నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనున్నట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఇప్పటికే.. ప్రధాని మోదీ తన కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను రెండుకు కుదించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాహనాల సంఖ్యను 50 శాతానికిపైగా తగ్గిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వం.. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *