Flight Emergency Landing: ఢిల్లీ-చెన్నై విమనాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో శంషాబాద్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ పరిణామంతో విమానంలో కలకలం రేగింది. పరిస్థితిని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించినట్లు సమాచారం. విమాన సిబ్బంది సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
విమానాల్లో పవర్ బ్యాంకుల విషయంలో జాగ్రత్తలు:
లిథియం బ్యాటరీలు అధికంగా వేడెక్కడం, దెబ్బతినడం లేదా లోపాలు ఏర్పడటం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. గతంలోనూ విమానాల్లో పవర్ బ్యాంకుల కారణంగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విమానాల్లో పవర్ బ్యాంకులతో మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడాన్ని నిషేధిస్తూ డీజీసీఏ 2025 నవంబర్‌లో విమానయాన సంస్థలకు సూచనలు జారీ చేసింది.
ప్రయాణికులు విమానయాన సంస్థల బ్యాటరీ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. పవర్ బ్యాంక్ దెబ్బతిన్నట్లుగా కనిపించినా, అసాధారణంగా వేడెక్కినా దాన్ని ఉపయోగించకూడదు.
