మంచిర్యాల: చిన్న మొత్తాల పొదుపుతోనూ పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపించాడో వ్యక్తి. రోజువారీ అవసరాల కోసం కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినప్పుడు మిగిలిన చిల్లరను వృథా చేయకుండా మూడేళ్లపాటు దాచుకున్నాడు. అలా పోగైన రూ.1.23 లక్షలతో ఏకంగా కొత్త బైక్‌ను కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
రూ.10 నాణాలతోనే బైక్ కొనుగోలు
లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన బొడ్డు రవి జోసెఫ్ స్థానిక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. రోజువారీ కొనుగోళ్ల సమయంలో మిగిలే చిల్లరలోని రూ.10 నాణాలను ప్రత్యేకంగా దాచుకుంటూ వచ్చాడు. ఇలా గత మూడేళ్లుగా పొదుపు చేయడంతో మొత్తం రూ.1.23 లక్షలు పోగయ్యాయి. ఈ మొత్తంతో కొత్త బైక్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
నాణాలను లెక్కించేందుకు రెండు గంటలు
అక్టోబర్ 10వ తేదీన, పదో నెల పదో తేదీ కావడంతో అదే రోజు బైక్ కొనుగోలు చేయాలని రవి జోసెఫ్ భావించాడు. తన వద్ద పోగైన రూ.10 నాణాలను తీసుకుని లక్షెట్టిపేటలోని హోండా షోరూంకు వెళ్లాడు. అక్కడ నాణాలతో బైక్ కొనుగోలు చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో నాణాలు ఉండటంతో షోరూం సిబ్బంది అంతా కలిసి వాటిని లెక్కించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.
చిల్లర డబ్బులను చిన్నచూపు చూడకుండా క్రమశిక్షణతో పొదుపు చేస్తే పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చని రవి జోసెఫ్ నిరూపించాడు. సాధారణంగా ఖర్చుల్లో భాగంగా మిగిలిపోయే నాణాలనే పెట్టుబడిగా మార్చుకుని తన బైక్ కలను నెరవేర్చుకోవడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఆయన పొదుపు విధానం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
