Headlines

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది.

రెండేళ్ల కాలంలో ఎన్నికల హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికాభివృద్ధి, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఈ సభ ద్వారా తమ ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందుంచనుంది. అలాగే రాబోయే మూడేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టనున్న కార్యక్రమాలపై కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వనున్నారు.

సభ కోసం తిరుపతిలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. వేలాదిమంది హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల సాధన, పాలనాపరమైన సంస్కరణలను ప్రజలకు వివరించేందుకు సభా ప్రాంగణంలో 20 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ శాఖల పనితీరును ఈ స్టాల్స్ ద్వారా ప్రదర్శించనున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూటమి శ్రేణులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో 30 వేల మందికి పైగా జనసమీకరణ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించగా, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, వైద్య సేవలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.

సభ నేపథ్యంలో తిరుపతి నగరంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని జిల్లా పోలీసులు ప్రకటించారు. చిత్తూరు, కడప, నెల్లూరు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ప్రజలు ముందస్తుగా ప్రయాణ ప్రణాళిక రూపొందించుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి సభ అనంతరం అమరావతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి భారీ సభలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *