Headlines

ఎల్‌నినోతో టమోటా రైతుల విలవిల.. ధర ఉన్నా.. ఎండల దెబ్బకు దిగుబడి ఢమాల్‌! | Kharif Tomato Crisis: El Nino Wreaks Havoc on Chittoor and Annamayya District Yield Drought Impact


ఎల్ నినో ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా టమోటా రైతాంగాన్ని చావు దెబ్బతీసింది. ఒక సహజ వాతావరణ మార్పు టమోటా సాగు చేసిన రైతులను నిండా మంచింది. ఉష్ణోగ్రతలు, గాలుల్లో మార్పు లకు కారణమైన ఎల్ నినో రుతుపవనాలను బలహీనపడేలా చేసింది. దీంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులకు కారణమైన ఎన్ నీనో టమోటా సాగు చేసిన ఖరీఫ్ రైతుకు నష్టాలను మిగిల్చింది. ధర ఉన్నా దిగుబడి లేక కొత్త కష్టాన్ని తీసుకొచ్చింది.

ఖరీఫ్ రైతును కుంగదీసింది

రాయలసీమలోని పశ్చిమ ప్రాంతం రైతాంగానికి ఈ ఏడాది ఎల్ నినో శాపంగా మారింది. టమోటా సాగు చేసిన రైతాంగం అసాధారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో కుదేలయ్యింది. ఎండల సెగ టమోటా సాగు విస్తీర్ణం తగ్గడానికే కాదు, రైతుపై పెట్టుబడి భారాన్ని కూడా పెంచింది. ఎల్ నినో వాతావరణంలో పెను మార్పులకు కారణం అయ్యింది. అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎల్ నినో ప్రభావం చూపడంతో వర్షాభావ పరిస్థితులకు కారణం అయ్యింది.

వర్షాలు కురిపించే రుతుపవనాలను ఎల్ నినో బలహీనపర్చడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు కర్ణాటక, అనంతపురం సరిహద్దు మండలాల్లో టమోటా సాగు చేసిన రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరికి గురిచేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో టమోటా సాగు, పెను మార్పులను చవిచూసింది. దీంతో ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన టమోటా పంటకు ధర ఉన్నా దిగుబడి లేకుండా చేసింది. ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్రమైన ఎండలు, వడగాలులు వల్ల టమోటా క్వాలిటీ పైనా దెబ్బ పడింది. ఖరీఫ్ సీజన్ లో దాదాపు 9 వేల హెక్టార్లలో సాగు చేసిన అన్నమయ్య జిల్లా రైతాంగం ఎలినివో ప్రభావాన్ని గురి చూసింది.

ఎండల తీవ్రతకు అడ్డం పడుతున్న మొక్క

అన్నమయ్య జిల్లా లో ప్రధాన ఆదాయ పంటగా టమోటాను సాగు చేసిన రైతాంగం ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల సాగు సమయం లోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నారు సమయము నుంచి పిందె దశ, కోత దశల వరకు ఎన్నో కష్టాలను పడ్డ రైతులు ఆశించిన మేర దిగుబడి సాధించ లేకపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలతో చనిపోతున్న టమోటా మొక్కలను బతికించుకునే ప్రయత్నం రైతులు చేయాల్సి వచ్చింది.

గుడిబండలా మారిన సాగు ఖర్చులు

ఎండలతో రసం పీల్చే పురుగుల బెడద అధికం కావడంతో సాగు ఖర్చు రైతాంగానికి ఖరీఫ్ సాగు గుడిబండలా చేసింది. ఇక ఎండల తీవ్రతతో పూత రాలిపోయి దిగుబడిపైనే కాకుండా నాణ్యత పైనా ప్రభావం పడింది. గతేడాది ఇదే సీజన్ లో మదనపల్లి మార్కెట్ కు రోజూ 150 మెట్రిక్ టన్నులకు పైగానే టమోటా రాగా, ఇప్పుడు 50 మెట్రిక్ టన్నులకు మించి రాలేక పోయింది. ఖరీఫ్ లో సాగు చేసిన టమోటా దాదాపు 10 నుంచి 12 కోతల దిగుబడి పొందిన రైతాంగం ఈసారి మూడు కోతలతోనే టమోటా ఖరీఫ్ సీజన్ ను ముగించాల్సి వచ్చింది. దిగుబడి లోనే కాకుండా నాణ్యత లోనూ ఇలాంటి గడ్డు పరిస్థితిని రైతాంగం ఎదుర్కొనేలా చేసింది.

నాణ్యతతో పాటు తగ్గిన టమోటా దిగుబడి

ఇక ఎల్ నివో ప్రభావంతో ఇప్పటికీ భానుడి భగభగలు కొనసాగుతుండగా టమోటాకు మంచి ధర లభిస్తున్నా లాభం లేకపోతోంది. ఎకరానికి 5 టన్నుల దిగుబడి కే పడిపోగా ధరలు ఆశాజనకంగా ఉన్నా క్వాలిటీ లేకపోవడంతో టమోటా సాగు దెబ్బ తినిందని ఉద్యానవన శాఖ అభిప్రాయపడుతోంది. పంట దిగుబడి ఆఖరి దశలోనూ తెగుళ్ల బెడద వెంటాడుతుండటంతో రైతులకు ఉద్యానవన శాఖ పలు సూచనలు చేస్తోంది.

జిల్లా అంతా కరువే..!

ఇక ఎల్ నినో ప్రభావం టమోటా పైనే కాకుండా అన్నమయ్య జిల్లాలో సాగు పైనా తీవ్ర ప్రభావం చూపింది. ఖరీఫ్ లో జిల్లా సాగు విస్తీర్ణం 46 వేల హెక్టార్లు కాగా ఇప్పటిదాకా కేవలం 16 వేల హెక్టార్లకు మించి సాగు కాకపోవడం ఎల్ నీనో ప్రభావాన్ని ఎత్తి చూపుతోంది. ఇప్పటిదాకా సాగు చేయని 30 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రయత్నిస్తోంది. ఉలవలు, పశుగ్రాసం రైతాంగం సాగు చేసేలా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *