Headlines

నీట మునిగిన బాలుడు.. భారత సంతతి వైద్యురాలు అరెస్ట్! | Indian origin doctor mom arrested in Florida as she watched child drown


లూసియానాలో వైద్యురాలిగా పనిచేస్తున్న 48 ఏళ్ల సుకాంతిని సుబ్బయ్య తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న తన తల్లిని చూసేందుకు వెళ్లారు. అక్కడే నివసిస్తున్న ఖుషిల్ బండి అనే ఏడేళ్ల బాలుడు, అతడి కవల సోదరితో సుకాంతిని కుమారుడికి స్నేహం ఏర్పడింది. ఓ రోజు సాయంత్రం ఖుషిల్, అతడి కవల సోదరిని సుకాంతిని, ఆమె తల్లి పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు కలిసి స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన వెంటనే ముగ్గురూ నీటిలోకి దిగారు.

కొద్దిసేపటి తర్వాత ఖుషిల్ నీటిలో మునిగిపోయాడు. అయితే అతడు నీటిలో ఎక్కువసేపు కనిపించకపోవడాన్ని గమనించిన సుకాంతిని.. మిగిలిన ఇద్దరు పిల్లలను అతడి కోసం వెతకమని అడిగారు. నీరు లోతుగా ఉందని వారు చెప్పడంతో ఆమె మరో వ్యక్తి సహాయం కోరారు. ఆ వ్యక్తి కొలనులోకి దిగి ఖుషిల్‌ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

సీసీటీవీలో కీలక దృశ్యాలు

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సాయంత్రం 6.19 గంటలకు పిల్లలు కొలను వద్దకు చేరుకున్నారు. 6.20 గంటలకు ఖుషిల్ నీటిలో ఆడుకుంటూ కనిపించాడు. ఆ సమయంలో సుకాంతిని కెమెరా దృశ్యాల్లో కనిపించలేదు. ఏడు సెకన్ల తర్వాత ఆమె అక్కడ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు నిమిషం తర్వాత ఖుషిల్ నీటి అడుగుకు మునిగిపోయాడు. మరో నిమిషంన్నర తర్వాత సుకాంతిని కొలను అంచుకు వెళ్లి, నీటి మధ్యలోకి చూస్తూ నిలబడినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిందని పోలీసులు అన్నారు. మరో నిమిషం పాటు ఆమె ఎలాంటి చర్య తీసుకోలేదని, ఆ తర్వాత తన కుమారుడిని ఖుషిల్‌కు ఏమైందని అడిగారని దర్యాప్తు అధికారులు తెలిపారు. అనంతరం అక్కడున్న మరో వ్యక్తి సహాయం కోరారు. ఆ వ్యక్తి నీటిలోకి దిగి సుమారు 50 సెకన్లలో బాలుడిని బయటకు తీసుకొచ్చారు. ఖుషిల్ పూర్తిగా నీటిలో మునిగిపోయినప్పటి నుంచి బయటకు తీసే వరకు మొత్తం ఏడు నిమిషాల రెండు సెకన్లు పట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

‘భయంతో బిగుసుకుపోయాను’

పోలీసుల విచారణలో సుకాంతిని కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. ఖుషిల్ చాలాసేపు నీటిలో మునిగి ఉండటాన్ని గమనించినప్పుడు తాను భయంతో బిగుసుకుపోయానని, స్పృహ కోల్పోతానేమోనని అనిపించిందని ఆమె పోలీసులకు చెప్పారు. ఏడేళ్ల బాలుడిని నీటిలో నుంచి బయటకు లాగేంత శక్తి తనకు లేదని భావించానని, అందుకే మరో వ్యక్తి సాయం కోరినట్లు ఆమె చెప్పారు. అయితే సుకాంతిని సమయానికి స్పందించి ఉంటే బాలుడి ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేదని విచారణలో తేలినట్లు పోలీసులు ఆరోపించారు. ఆమె చెప్పిన వివరాలకు, సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన పరిణామాలకు మధ్య పొంతన లేదని అన్నారు.

చికిత్స పొందుతూ బాలుడి మృతి

కొలనులో నుంచి బయటకు తీసిన ఖుషిల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా మారింది. మూడు రోజుల తర్వాత కూడా మెదడులో ఎలాంటి చురుకుదనం కనిపించలేదు. మెదడులో వాపుతో పాటు మూర్ఛ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చివరకు ఏప్రిల్ 17న బాలుడికి అందిస్తున్న లైఫ్ సపోర్ట్‌ను తొలగించారు. అనంతరం అతడు మరణించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నివేదికలో మునిగిపోవడం వల్ల తలెత్తిన సమస్యలే మరణానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటన ఏప్రిల్ 10న జరగ్గా, ఓర్లాండో పోలీసులు తాజాగా సుకాంతిని సుబ్బయ్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను ఆరెంజ్ కౌంటీ జైలులో బెయిల్ లేకుండా నిర్బంధించారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆమెకు గరిష్ఠంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *