అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. వేలాది హెక్టార్లలో వరి పంట నీట మునిగింది.. ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. అటు.. అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు పలుమార్లు సమీక్షలు చేశారు. కలెక్టర్లతో నాలుగోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. తుఫాన్ సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.
కోనసీమ జిల్లాలో 33 వేల కొబ్బరి చెట్లు కూలినట్టు అంచనా రిపోర్ట్‌ను సీఎం చంద్రబాబుకు వివరించారు. మరోవైపు.. రాకాసి తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌తో ఫోన్లో మాట్లాడారు. ఏపీ తుఫాన్ పరిస్థితిని వివరించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపించాలని కోరారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత.. అమిత్ షాకు లేఖ రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు లేఖలో వెల్లడించారు. క్షేత్రస్థాయి సర్వే తర్వాత నష్టం అంచనాల సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిస్తామని అమిత్ షాకు తెలిపారు సీఎం చంద్రబాబు.
నిన్నంతా వరుస రివ్యూలతో అధికారులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేయబోతున్నారు. రెండు రోజులపాటు జిల్లాల్లో పర్యటించి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తారు. అలాగే.. ఆర్నబ్ తుఫాన్ సహాయక చర్యలపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం వర్చువల్‌గా జరగనుంది. తుఫాన్ పరిస్థితులు, నష్టం అంచనా, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అటు.. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
తుఫాన్ బాధితులకు ఆర్థిక సహాయం
పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 10 వేలు, దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు 3 వేలు అందించనుంది. దెబ్బతిన్న దుకాణాలకు 20 వేలు, చిన్న పరిశ్రమలకు 50 వేలు పరిహారం ఇవ్వనుంది. కోటి 50 లక్షల టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు లక్ష రూపాయలు సాయం చేయనుంది. ఫిషింగ్ బోట్లకు 9 వేలు, వలల మరమ్మతులకు 5 వేలు, వలలు పూర్తిగా దెబ్బతింటే 20 వేలు అందించనుంది. బోటు, వల రెండూ పూర్తిగా ధ్వంసమైతే 25 వేల సాయం ప్రకటించింది. ఇళ్లలోకి వరద నీరు చేరిన కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనుంది.
ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5లక్షల పరిహారం
తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే.. వరి పంటకు ఎకరాకు 20 వేలు, పత్తికి 25 వేలు, తమలపాకు తోటలకు ఎకరాకు 75 వేల సాయం ప్రకటించింది. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు ఒక్కోదానికి 15 వేల పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. బాధితులందరికీ భరోసా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు.
తుఫాన్ సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాల పునరుద్ధరణతో పాటు.. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
మొత్తంగా.. రాకాసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిహారం పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోంది. అటు.. తుఫాన్ నష్టం అంచనాపై ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
