అమరావతి (ధరణి న్యూస్):
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక పోరును ప్రతి ఒక్కరూ అత్యంత తీవ్రంగా, సీరియస్‌గా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలకు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మిత్రధర్మం కచ్చితంగా పాటించాల్సిందే!
కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు తేల్చిచెప్పారు. “మిత్రధర్మాన్ని పాటించడంలో ఎలాంటి వెసులుబాటూ లేదు. ఇందులో నో కాంప్రమైజ్” అని ఆయన ఘాటుగా హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో రెబల్స్ బరిలో దిగుతున్నారనే వార్తల నేపథ్యంలో, మూడు పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన ఆదేశించారు.
‘చెప్పాం-చేస్తున్నాం’ పేరుతో ప్రజల్లోకి..
2024 అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ‘చెప్పాం – చేస్తున్నాం’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

కేంద్రం, రాష్ట్రం మరియు స్థానిక సంస్థలలో ఒకే రకమైన (కూటమి) ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పనులు ఎంత వేగంగా జరుగుతాయో, ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఒక్కరికీ సోదాహరణగా వివరించాలని స్పష్టం చేశారు.
అసంతృప్తులకు భరోసా..
పొత్తుల కారణంగా, రిజర్వేషన్లు మరియు సోషల్ రీ-ఇంజనీరింగ్ సమతుల్యత పాటించాల్సి రావడం వల్ల కొందరు క్షేత్రస్థాయి నాయకులకు సీట్లు దక్కలేదని చంద్రబాబు వివరించారు. అయితే, పార్టీ కోసం మరియు రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటామని, భవిష్యత్తులో వచ్చే నామినేటెడ్ పదవుల్లో వారికి తగిన ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల నాటి నుండి ప్రభుత్వం వైపుగా ప్రజలకు వారధిగా నిలిచింది కార్యకర్తలేనని, నియోజకవర్గాల వారీగా నాయకులు,కార్యకర్తల పనితీరుపై రికార్డు నమోదువుతుందని హెచ్చరించారు.
ఎన్నికల షెడ్యూల్
కాగా, రాష్ట్రంలో పలు మున్సిపాల్టీల్లో కూటమి ఇప్పటికే ఏకగ్రీవ విజయాలను నమోదు చేయగా, మిగిలిన స్థానాలకు నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు నవంబర్ 3న వెల్లడి కానున్నాయి. ZP సీట్లకు సంబంధించి కూటమి నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
