11 ఏళ్ల బాలుడిని బలిగొన్న ప్రహరీ గోడ.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చిన ఆర్నబ్ తుఫాన్! | Tragedy in Guntur: 11 Year Old Boy Dies After Old Compound Wall Collapses in Heavy Rain


గుంటూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా పాత ప్రహరీ గోడ కూలి 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జరిగిన ఈ విషాద ఘటన..ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన చింతలపూడి దేవాన్సు (11) వర్షాల కారణంగా ప్రమాదానికి గురయ్యాడు. ఇంటి పక్కనే ఉన్న పాత ప్రహరీ గోడ భారీ వర్షానికి ఒక్కసారిగా కూలి బాలుడిపై పడింది. దీంతో గోడ శిథిలాల కింద చిక్కుకున్న దేవాన్సు అక్కడికక్కడే మృతిచెందాడు.

రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో బాలుడు గోడ కింద చిక్కుకున్న విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు. తల్లిదండ్రులు బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వర్షం తగ్గిన తర్వాత అతడి కోసం వెతకగా, కూలిన గోడ కింద విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

భారీ వర్షాల సమయంలో పాత ప్రహరీ గోడలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల సమీపంలో ఉండటం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరమైన గోడలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *