స్వీట్లు కావు.. రసాయనాలు..! ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే.. గడువు ముగిసిన వాటితో.. | Hyderabad Sweet Shops Raid: 3,546 Kg Food Seized, 5 Licenses Suspended Ahead of Diwali


ఎన్ని తనిఖీలు చేయనీ.. ఎన్ని వార్నింగ్‌లు ఇవ్వనీ.. ఎన్ని నోటీసులు ఇవ్వనీ.. చివరికి లైసెన్స్‌లు క్యాన్సిల్‌ చేయనీ.. మార్పు వచ్చేదిలేదు.. తీరు మారేది లేదు.. ఇదీ.. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు, హోటల్స్‌ పరిస్థితి.. వీటికి ఏమాత్రం తీసిపోము అంటున్నాయి.. స్వీట్‌ షాపులు. దివాళీ సమీపిస్తుండటంతో కొద్దిరోజులుగా స్వీట్‌ షాపులపై ఫోకస్‌ పెట్టిన టీజీ సేఫ్‌ అధికారులకు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నాచితకా షాపులే కాదు.. పెద్దపెద్ద సంస్థలు.. బ్రాండెడ్‌ స్వీట్‌ షాపుల్లోనూ ఇవే పరిస్థితులు దర్శనమిస్తుండటం నివ్వెరపోయేలా చేస్తున్నాయి.. ఆ డిటేయిల్స్‌ ఏంటో ఒక్కసారి చూద్దాం…

హైదరాబాద్‌లో టీజీ సేఫ్‌ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. దాడులు చేసే కొద్దీ భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని స్వీట్ల తయారీ కేంద్రాలపై TG SAFE అధికారులు కొరడా ఝుళిపించారు. క్యూర్‌ పరిధిలోని 16 స్వీట్స్‌ తయారీ, విక్రయ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దీంతో.. స్వీట్‌ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. స్వీట్లపై న్యూస్‌ పేపర్లు కప్పుతున్నట్టు గుర్తించారు. అలాగే.. కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు పరుగులు తీస్తుండటం.. ఈగలు మోత మోగిస్తున్న సీన్లతో టీజీ సేఫ్‌ అధికారులు షాకయ్యారు. మరో అడుగు ముందుకేసి.. ఆహార పదార్థాలను తనిఖీ చేయడంతో వాటిల్లోనూ డొల్ల పరిస్థితులే కనిపించాయి. గడువు ముగిసిన, లేబుల్స్ లేని ఆహార పదార్థాలను భారీగా గుర్తించి సీజ్‌ చేశారు. కల్తీ స్వీట్ల అనుమానంతో 22 ఆహార నమూనాలను సేకరించారు. ఆయా స్వీట్‌ షాపుల్లో 16లక్షల 86వేల రూపాయల విలువైన 3వేల 546 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు స్వీట్ షాపులు, ఆహార తయారీ కేంద్రాలను మూసివేయడంతో పాటు.. ఐదు సంస్థల ఫుడ్‌ లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

జీ.పుల్లారెడ్డి షాపులోనూ నిబంధనలు పాటించకుండా స్వీట్లు తయారీ

మరోవైపు.. పేరు గొప్ప-ఊరు దిబ్బ అన్నట్టుగా బ్రాండెడ్‌ స్వీట్‌ షాపుల్లోనూ అదే కంపు.. అదే పరిశుభ్ర వాతావరణం.. సనత్‌నగర్‌లోని జీ.పుల్లారెడ్డి స్వీట్స్‌ షాపే అందుకు నిదర్శనం. సనత్‌నగర్‌లోని జీ.పుల్లారెడ్డి స్వీట్స్‌ షాపులో తనిఖీలు చేసిన టీజీ సేఫ్‌ అధికారులు.. కీలక విషయాలను గుర్తించారు. ఏమాత్రం నిబంధనలు పాటించకుండా స్వీట్లు తయారు చేస్తున్నట్టు తేల్చారు. దీంతో.. భారీగా ఆహార పదార్థాలు సీజ్ చేశారు. సనత్‌నగర్‌లోని జీ.పుల్లారెడ్డి స్వీట్స్‌ షాపులోలోనే 3వేల 133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని టీజీ సేఫ్‌ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఓ స్వీట్‌ షాపులోని కిచెన్‌లో దరిద్రపు పరిస్థితులను గమనించిన అధికారులు.. జీడిపప్పును జల్లెడ పట్టడంతో పురుగులు పరుగులు తీయడం విస్తుపోయేలా చేసింది.

మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తా-అవినాష్ మహంతి

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు TG SAFE కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్వీట్‌ షాపులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే.. కొన్నింటికి నోటీసులు ఇచ్చామని.. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక.. కొద్దిరోజుల క్రితం కూడా హైదరాబాద్‌లోని పలు స్వీట్ షాపుల్లో 12 ప్రత్యేక బృందాలతో TG SAFE అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్స్ తయారు చేయడం, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా దుకాణాలు నిర్వహించడం, గడువు ముగిసిన స్వీట్స్‌ను విక్రయానికి ఉంచడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల గడువు ముగిసిన స్వీట్స్‌ను కొత్త స్వీట్స్ తయారీలో కలుపుతున్నట్టు, పురుగులు, ఫంగస్ ఉన్న పల్లీలు, స్వీట్స్‌ను అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవడంతో పాటు, మరికొన్ని దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి 16 స్వీట్‌ షాపుల తనిఖీల్లోనూ ఇవే పరిస్థితులు ఉండటంతో టీజీ సేఫ్‌ అధికారులు సీరియస్‌ యాక్షన్‌కు దిగారు. మొత్తంగా.. దివాళీ సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లోని స్వీట్ షాపుల్లో దర్శనమిస్తున్న పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వీట్‌ ప్రియులారా..బీ అలర్ట్‌.. ఎంత గొప్ప బ్రాండైనా లోపలంతా డొల్లే.. బీకేర్‌ ఫుల్‌..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *