శతాబ్దాల చరిత్రకు డిజిటల్‌ రక్షణ.. తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం | Tirumala Temple Inscriptions to Be Digitized Under Bharat SHRI Project


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎన్నో శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం.. ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు.. అప్పటి రాజుల పాలన నుంచి సామాజిక పరిస్థితులవరకు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఆ చారిత్రక సంపదను భవిష్యత్తు తరాలకు అందించేందుకు భారత పురావస్తు శాఖ నడుం బిగించింది. భారత్‌ శ్రీ ప్రాజెక్టులో భాగంగా తిరుమల ఆలయంలోని శాసనాలను డిజిటలైజేషన్‌ చేస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో మొత్తం సుమారు 750 శాసనాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచే ప్రక్రియ చేపట్టింది. గతంలో ఆలయ రెండో ప్రాకారం నుంచి 44 శాసనాలను కేంద్ర పురావస్తు శాఖ సేకరించింది. 2009లో ఆనంద నిలయం గర్భాలయ గోడల నుంచి మరో 53 శాసనాలను సేకరించింది. ఇప్పుడు మిగిలిన సుమారు 600 శాసనాలను డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియను ప్రారంభించింది.

ఈ క్రమంలోనే.. తిరుమల ఆలయంలోని శాసనాల్లో కొన్ని అత్యంత ప్రాచీనమైనవిగా తేలాయి. క్రీస్తుశకం పదో శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్న వైదుంబుల శాసనాలు చరిత్రకారులకు కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. అప్పటి పాలకులు, ఆలయానికి అందించిన సేవలు, సమాజంలోని పరిస్థితులను ఈ శాసనాలు తెలియజేయనున్నాయి. మరోవైపు.. విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన సుమారు పది మీటర్ల పొడవైన తమిళ శాసనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రీస్తుశకం 16వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించిన ఈ శాసనం.. ఆనాటి చరిత్రను తెలుసుకునేందుకు విలువైన ఆధారంగా భావిస్తుంది.

ఈ శాసనాల్లో దాగి ఉన్న రాజకీయ, సామాజిక, మతపరమైన, ఆర్థిక, సాంస్కృతిక చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే భారత పురావస్తు శాఖ ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా.. తిరుమల శ్రీవారి ఆలయ వైభవాన్ని, వారసత్వ సంపదను భావితరాలకు అందించే దిశగా చేపట్టిన ఈ డిజిటలైజేషన్‌ కార్యక్రమం కీలకంగా మారనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *