Video: బయట జోరున వర్షం.. గుడిసెలో నుంచి వింత సౌండ్ .. టార్చ్ వేసి చూస్తే గుండెలు గుభేల్.. | Massive Python Slithers into Hut Amid Cyclone Arnab Rains in Anakapalli, Rescued Safely, Watch Video


తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భీకర ఈదురు గాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమై భయంభయంగా గడుపుతున్నారు. వర్షం ఎప్పుడు తగ్గుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఇంట్లో కూర్చున్న ఓ మహిళకు కలలో కూడా ఊహించని షాకింగ్ దృశ్యం ఎదురైంది. సామాన్ల మధ్య కదలిక రావడంతో అనుమానంతో తొంగి చూసిన ఆ మహిళ.. అక్కడ నక్కి ఉన్న భారీ కొండచిలువను చూసి భయంతో వణికిపోయింది. ప్రాణభయంతో జోరు వర్షంలోనే బయటకు పరుగులు తీసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఉద్దపాలెం గ్రామానికి చెందిన రాజన్న లక్ష్మి అనే మహిళ ఓ పూరిపాకలో నివసిస్తోంది. తుఫాను తాకిడికి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆమె ఇంటి పట్టునే ఉండిపోయింది. ఆ సమయంలో ఇంట్లోని సామాన్ల సందులో ఏదో కదులుతున్నట్లు శబ్దం రావడంతో లక్ష్మి అక్కడికి వెళ్లి పరిశీలించింది. తీరా చూడగా, అక్కడ ఓ భారీ కొండచిలువ సురక్షితంగా తలదాచుకుంటూ నక్కి కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా గుండె గుభేలుమనడంతో, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆమె కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది.

స్నేక్ క్యాచర్ చాకచక్యం.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు

మహిళ కేకలు విని చుట్టుపక్కల స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పూరిపాకలో కొండచిలువ ఉన్న విషయాన్ని గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఓ స్నేక్ క్యాచర్‌ను ఘటనా స్థలానికి రప్పించారు. స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా సామాన్ల మధ్యలో నక్కి ఉన్న కొండచిలువను పట్టుకుని సురక్షితంగా రెస్క్యూ చేయడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉద్దపాలెం గ్రామానికి సమీపంలో కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం ఉండటంతో.. భారీ వర్షాలు, వరద నీటి తాకిడి తట్టుకోలేక సురక్షిత ప్రదేశం కోసం కొండచిలువ పూరిపాకలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *